సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఇంటి ముట్టడిలో భాగంగా ముందస్తుగా మల్లారెడ్డిని పోలీసులు నిర్భందించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. బోయిన్ పల్లిలోని మల్లారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి వెళ్ళటానికి ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు మల్లారెడ్డి. నిర్బంధాలు,ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు .ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థం అయ్యాయని అన్నారు.ప్రజా పాలన అంటే నిర్బంధాలా? అని ప్రశ్నించారు.
మరో వైపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి బయల్దేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. బాచుపల్లిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి వివేకానంద నగర్ లోని అరికెపూడి గాంధీ ఇంటికి బయలు దేరిన కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్లకు ఓ న్యాయం..మాకో న్యాయమా అంటూ పోలీసులను ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తున్నామని చెప్పారు. దీంతో బలవంతంగా కౌశిక్ రెడ్డి..శంభీపూర్ రాజును ఇంట్లోకి పంపించారు పోలీసులు. గాంధీ ఇంటికి వెళ్లడానికి అనుమతి లేదంటూ చెప్పారు. కౌశిక్ రెడ్డిని బయటకు రానివ్వడం లేదు. బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.