లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొరి వెంట ఒకరు కారు దిగుతూ అధికార పార్టీ హస్తంతో దోస్తీ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీలుగా మారిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి డీకే శివకుమార్ తో కలిసి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కర్నాటక కాంగ్రెస్ నేత డికె శివ కుమార్‌తో మల్లారెడ్డి, భద్రారెడ్డి భేటీ ఆసక్తిగా మారింది. బెంగళూరులో డికెను మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి కలిశారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి కలిసిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరితే మల్కాజ్‌గిరి పార్లమెంట్ టికెట్ తన కుమారుడికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్టు సమాచారం. బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు మల్లారెడ్డి కుమారుడికి ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఐనా తండ్రీ కుమారులు కాంగ్రెస్ అగ్రనేత డికె శివ కుమార్‌ను కలవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.