తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 50 రోజుల పాలనలో 50 రకాల వేషాలు వేసిందని విమర్శించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. 56 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ... ఎప్పుడు కూడా రాష్ట్రానికి న్యాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలన ఉన్న ఒకటే లేకున్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను ఫిబ్రవరి 03వ తేదీ శనివారం మల్లారెడ్డి దర్శించుకున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ తోనే తెలంగాణలో ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు మల్లారెడ్డి. కొండగట్టు అభివృద్ధికి గత బీఅర్ఎస్ ప్రభుత్వం రూ. 500 కోట్లు ప్రకటించిందని తెలిపారు దేశంలోనే అతిపెద్ద అంజన్న గుడి కొండగట్టు ఆలయమన్న మల్లారెడ్డి.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలని కొండగట్టు అంజన్నకు మొక్కుకున్నానని తెలిపారు.
ఆయుధంతో అంతరాలయంలోకి గన్ మెన్
కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి మాజీ మంత్రి మల్లారెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి వచ్చారు. అంతరాలయంలో స్వామి వారికి పూజలు చేస్తున్న సమయంలో మల్లారెడ్డి గన్ మెన్ కూడా వెపన్ తో ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయ సిబ్బంది వారించినా కూడా ఆయుధంతోనే అంతరాలయంలోనే ఉన్నాడు గన్ మెన్. ఆలయ నిబంధనల ప్రకారం ఆలయంలోకి ఆయుధంతో ప్రవేశించకుడదు. కానీ కనీస నిబంధనలు పాటించకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు.