సీఎం బతికున్నంత కాలం జనగామలోనే ఉంటా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

సీఎం బతికున్నంత కాలం జనగామలోనే ఉంటా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

 

  • ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

జనగామ, వెలుగు: సీఎం కేసీఆర్​ ముందట నీచ రాజకీయాలు చేస్తే సాగవని, అక్కడక్కడ మోపైన కోతులు కొండెంగల మెడలను ముఖ్యమంత్రి విరుస్తాడని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాట్​ కామెంట్స్​ చేశారు. జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ...‘‘యేన్నో కూసుంటే నడవదు.. గెస్ట్​ హౌజల పంట రాజ్యమేలి.. బగ్గదాగి రాజకీయం చేస్తా అంటే కుదరదు..ప్రజా క్షేత్రంలో తిరుగాలె.. మండుటెండలో ప్రజల పక్షాన నిలబడాలె.. అది వదిలి వానికి వీనికి శారెడు తాపిచ్చి నీచమైన రాజకీయం చేస్తా అంటే మా ముఖ్యమంత్రి సహించడు.. మా ముఖ్యమంత్రి బతికున్నంత కాలం నేను జనగామ రణ క్షేత్రంలోనే ఉంటా.. ప్రజలకు సేవ చేస్తా” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

2014లో, 2018లో తనకు టికెట్​ రాదని కుట్రలు చేశారని తెలిపారు. ‘‘ముత్తిరెడ్డి వివాదాస్పదుడు.. బెదిరిస్తడు..కబ్జాలు పెడుతడు.. గెలువడు అని నల్లికుట్లోళ్లు కుప్పిగంతులు వేశారని ఆ ఆటలు కేసీఆర్​ ముందు సాగలె.. నాకే టికెట్​ ఇచ్చిండు. ఇక్కడి ప్రజలు గెలిపించిన్రు. మళ్లా ఇప్పుడు ఎలక్షన్​ల ముందు అక్కడొకలు.. ఇక్కడొకలు అన్నట్లు గాయి గాయి చేస్తున్నరు.. ఆగం జెయ్యాలని జూసేటోళ్లను పట్టించుకోవద్దు.. ముఖ్యమంత్రికి నాపై నమ్మకం ఉంది.. నాకు ముఖ్యమంత్రిపై నమ్మకం ఉంది. కార్యకర్తలను కడుపుల పెట్టుకుని కాపాడుకుంట.. బీఆర్​ఎస్ ను మూడో సారి అధికారంలోకి తీసుకురావాలి”అని ముత్తిరెడ్డి పిలుపునిచ్చారు.

కాగా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డిని ఉద్దేశించే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేసి ఉంటారని కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు. సమావేశంలో తరిగొప్పుల మండల అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్​ రెడ్డి, జడ్పీటీసీ ముద్దసాని పద్మజా రెడ్డి, ఎంపీటీసీ అర్జుల మధుసూదన్​ రెడ్డి, లీడర్లు బీరెడ్డి జార్జ్​ రెడ్డి, కేసిరెడ్డి ఉపేందర్​ రెడ్డి, జొన్నగోని సుదర్శన్​, నంద్యా నాయక్​, వీరేందర్​ తదితరులు పాల్గొన్నారు.