
మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు .
తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో మైనంపల్లి ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి అసెంబ్లీ, కొడుకుకు మెదక్ టికెట్ ఖరారైనట్లు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 27న ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ లో బుజ్జగింపులు
ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ, క్యాడర్ ను కాపాడుకుంటూ, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసి.. టికెట్ తమకే వస్తుందన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకుల పరిస్థితి తాజా పరిణామాలతో అగమ్యగోచరంగా మారింది. ఈ విషయమై ఆశావహులను కదిలిస్తే కొందరేమో ఇంతకాలంగా పార్టీకోసం పనిచేసిన తమకు కాదని కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్లకు టికెట్ ఎలా ఇస్తారని అంటున్నారు. మరికొందరేమో న్యాయంగా అయితే తమకే టికెట్ ఇవ్వాలి.. కానీ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని కాదనలేం కదా అని సర్దిచెప్పుకుంటున్నారు. కొత్త అభ్యర్థికే కాంగ్రెస్టికెట్లభిస్తే ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతూ దరఖాస్తు చేసినవారి నుంచి అసమ్మతి ఎగిసేపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆశావహులను బుజ్జగించే పనిలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్న ముఖ్యమైన లీడర్లకు పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్ట్‌ల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి పార్టీ ఖరారు చేసే అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని నచ్చచెబుతున్నట్లు సమాచారం.