- ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
మిర్యాలగూడ, వెలుగు: ‘సర్పంచులు.. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు.. కౌన్సిలర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నా..కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పైసలను దయచేసి ముట్టుకోకండి..మీకేమైనా ఇబ్బందయితే నేనిస్తా’ అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని 398 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.3.98 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఊళ్లలో కొందరు ప్రజాప్రతినిధులు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీంలకు మధ్యవర్తులుగా మారి పైసలు అడుగుతున్నట్లు తెలిసిందని ఈ వసూళ్లు ఆపాలని అని ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకు హెచ్చరించారు. పదేండ్లుగా ఎటువంటి అభివృద్ధి చేయనోళ్లు..ఏదో చేస్తమని ప్రచారం చేసుకుంటుండ్రు..ఎవరి మాటలు నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో రైతు ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎంపీపీలు సరళ , నందిని, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, కౌన్సిలర్లు రమేశ్, ఉదయ్ భాస్కర్ గౌడ్తదితరులు పాల్గొన్నారు.