ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ పట్ల దురుసు ప్రవర్తన, కార్యక్రమాన్ని రచ్చరచ్చగా మార్చిన ఘటనలో హుజూరాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై కరీంనగర్‌ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మూడు వేరు వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కౌశిక్ రెడ్డికి కరీంనగర్‌ మున్సిఫ్ కోర్టు ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై నమోదైన రిమాండ్ రిపోర్టును కొట్టివేసింది.

అసలేం జరిగిందంటే..?

ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన  సమీక్ష సమావేశంలో కౌశిక్‌రెడ్డి రెచ్చిపోయాడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ పట్ల వ్యక్తిగత దూషణకు పాల్పడ్డాడు. అంతేకాదు, ప్రజా కార్యక్రమాన్ని రసాభాసగా మార్చారు. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆయనపై బిఎన్ఎస్ యాక్ట్ లోని 115(2), 121(1), 126(2), 221, 292, 351(2), 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.