తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం అని.. తాగునీటి ప్రాజెక్టుల కోసం అతను తీసుకుంటున్న నిర్ణయాలు అమోఘం అని.. రైతు విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు వెల్లడించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసులరెడ్డి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా.. రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాలకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారాయన.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారాయన. 2024, జూన్ 21వ తేదీ ఉదయం తన ఇంటికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిని సాదరంగా ఆహ్వానం పలికారు పోచారం శ్రీనివాసులరెడ్డి. ఆరు నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో పరిపాలన అద్భుతంగా ఉందని.. అభివృద్ధి పధంలో సాగుతుందని.. చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఎంతో బాగున్నాయన్నారు పోచారం శ్రీనివాసులరెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం వెనక రాజకీయంగా ఆశిస్తున్నది ఏమీ లేదని.. మంచి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారని.. రైతు కోసం పని చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు పోచారం. నా రాజకీయ ప్రస్తానం మొదలైందే కాంగ్రెస్ పార్టీలో అని.. ఆ తర్వాత టీడీపీ.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్లు చెప్పిన ఆయన.. మళ్లీ ఇన్నాళ్లు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు పోచారం. వరుణుడు సైతం చల్లగా ఆశీర్వదిస్తున్నారంటూ మీడియా ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారాయన.