కురవి, వెలుగు: ‘బీఆర్‌ఎస్ పార్టీలో ఇంటి దొంగలతో జాగ్రత్తగా ఉండాలి, కొందరైతే నా చావు కోసం ఎదురు చూస్తున్నారు’ అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కొందరు వ్యక్తులు పార్టీ పేరు చెప్పుకొని రూ. లక్షలు సంపాదిస్తున్నారని, అలాంటి వారిని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పోరాటమే చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదంతోనే గెలుస్తున్నానన్నారు.
తనను కాదని గతంలో వేరే వారికి అవకాశం ఇస్తే వారు నియోజకవర్గంలో ఒక్క బోరు వేసి, ఒక్క ఊరు తిరిగిన దాఖలాలు లేవన్నారు. తన పనితనానికి నియోజకవర్గ అభివృద్ధే నిదర్శనమన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఎంపీపీ గుగులోతు పద్మ రవినాయక్‌కు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, నాయకులు పురాణం సతీష్, రవిచంద్ర, తోట లాలయ్య, బజ్జూరి పిచ్చిరెడ్డి, ఎర్రంరెడ్డి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.