కాంగ్రెస్ నుంచే వచ్చా మళ్లీ కాంగ్రెస్ లోకే వెళ్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఖచ్చితంగా కాంగ్రెస్  పార్టీలోకి వెళ్తానని చెప్పారు బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే  రేఖానాయక్. తనను బీఆర్ఎస్ పక్కన పెట్టిందని..  ఎమ్మెల్యే  పదవి కాలం ముగిసే వరకు ఆ పార్టీలోనే ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ నుంచే వచ్చా మళ్లీ కాంగ్రెస్ లోకే వెళ్తానన్నారు. మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతానని చెప్పారు. పన్నేండేళ్గుగా రాజకీయాల్లో ఉన్న నన్ను కేసీఆర్  పక్కన పెట్టారన్నారు.  ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక గొడుగు కిందకు వెళ్లక తప్పదన్నారు.

కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్  115 మంది అభ్యర్థుల లిస్టులో ఖానాపూర్ సీటు జాన్సన్ నాయక్ కు ఇచ్చారు.  ఆమె భర్త ఇప్పటికే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.  పార్టీ మారే విషయంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ డైలమాలో పడ్డారు. ఆ పార్టీలో ఉంటూనే ఆమె కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ టికెట్​కు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరే విషయంపై ఆమె.. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ పొందిన జాన్సన్ నాయక్ క్రిస్టియన్ అని, ఎస్టీ కాదని రేఖా నాయక్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ టికెట్ తనదేనని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలతోనూ ఆమె చర్చలు కొనసాగిస్తున్నారు. ఖానాపూర్ టికెట్ ఇస్తే పార్టీలోకి వస్తానని ఆమె స్పష్టం చేసినట్టు తెలిసింది. 

అయితే, కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రం ఆదిలాబాద్ ఎంపీ.. లేదంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. ఏదో ఒక స్థానాన్ని డిసైడ్ చేసుకోవాలని సూచించినట్టు చెప్తున్నారు. అయితే, ఆమె మాత్రం ఖానాపూర్ కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం.  అయితే, ఆసిఫాబాద్ నుంచి ఇప్పటికే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ అప్లై చేసుకున్నారు. ఆయన కూడా ఆ స్థానం నుంచి పోటీ చేయాలని గట్టిగానే డిసైడ్ అయ్యారు. రాజకీయ భవిష్యత్ కోసమే కాంగ్రెస్​లోకి వస్తున్నామని ఆయన చెప్తున్నారు. ఇద్దరం పోటీలో ఉండాలన్నదే తన ఆలోచన అని శ్యామ్ నాయక్​ చెప్తున్నట్టు తెలిసింది.