జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే :  బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల జిల్లా : జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే అని, అభ్యంతరాలకు 60 రోజుల సమయం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఏ ఒక్కరికీ ఇబ్బందులు ఉండవని, ప్రజాభీష్టం మేరకే మాస్టర్ ప్లాన్ ఉంటుందని చెప్పారు. రెచ్చగొట్టే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, రైతులకు తాము అండగా ఉంటానని తెలిపారు.

1989లో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్  పుప్పాల ఆశలు అనే వ్యక్తి ఉన్న సమయంలోనే విజయపురి, గాంధీనగర్ పరిసర ప్రాంతాలను కలిపి మాస్టర్ ప్లాన్ తయారు చేశారని వివరించారు. చింతకుంట కింద ప్లే జోన్,పార్క్ జోన్, విజయపురి వైపు రైల్వేజోన్,గోవింద్ పల్లి వైపు హాస్పిటల్ జోన్ ఉండేదని అన్నారు.

జగిత్యాల పట్టణంలో చట్టబద్ద అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారు. దేశంలోనే పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లు రాష్ట్రం అంతటా మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు నిర్ణయం మాత్రమే తీసుకున్నారని తెలిపారు. ఢిల్లీ సంస్థ ద్వారానే సర్వే జరిపించారని అన్నారు. మాస్టర్ ప్లాన్ ఫ్లెక్సీలు ప్రజల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేశారని చెప్పారు. మాస్టర్ ప్లాన్ పై దాదాపు 60 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రతిపక్ష నాయకుల అసత్య మాటలు నమ్మి, రైతులెవరూ ఆగం కావొద్దని అన్నారు.