రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్ళపల్లి మండలంలో ప్రభుత్వ భూములను స్థానిక బీఆర్ఎస్ శాసనసభ్యుడి ముఖ్య అనుచరులు కొందరు స్వాధీనం చేసుకుని అప్పనంగా లావణి పట్టాలు పొందారు. గత అధికార పార్టీ శాసనసభ్యులు, ప్రభుత్వంలో కీలక మంత్రి వ్యవహరించిన నాయకుడి కనుసన్నల్లో మెదిలిన అధికారుల అండదండలతో ఆయన అనుచరులు అక్రమాలకు తెరతీశారు. వీరు లావణి పట్టాల పేరు మీద భూమి పొందడమే కాకుండా అట్టి భూములకు రైతుబంధు కూడా తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ గత ప్రభుత్వకాలంలో జరిగిన ప్రభుత్వ భూముల లావాదేవీలను వెలికి తీస్తున్నారు. అంతేగాకుండా ఆ నాయకులపైన రెవెన్యూ చట్ట పరిధిలో కఠినచర్యలు తీసుకుంటున్నారు.
శాసనసభ్యుడి నడవడికకు ప్రతిస్పందనగా జిల్లా కలెక్టర్‌పై చేసిన ఆరోపణలకు ఇక్కడి ప్రజలు, నాయకులు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు. విపరీతమైన అహంతో అసహనంతో ఈ విధంగా మాట్లాడడం తెలంగాణవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. కేటీఆర్ ప్రవర్తన తీరుతో విలువలకు మంగళం పాడినట్టు అయినది. దాదాపు వెయ్యికోట్ల విలువ కలిగిన భూమిని సిరిసిల్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా సొంతం చేసుకున్నారు. స్థానిక శాసనసభ్యుడి ఆశీస్సులు అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన సన్నిహితులు ప్రభుత్వ భూమిని అక్రమంగా పొందారని నిపుణులు చెపుతున్నారు.
భూములను పొందిన లబ్ధిదారుల ఖాతాల్లోకి 10 కోట్ల రూపాయల వరకు రైతుబంధు పేరిట ఆర్థిక సహాయం పొందినట్టు సంబంధిత వర్గాల ద్వారా ప్రజలకు తెలుస్తున్నది .
Also Read : జమిలి ఎన్నికలు.. నియంతృత్వం వైపు అడుగులు.!
రెవెన్యూ అధికారులు అక్రమంగా రైతుబంధు పొందిన లబ్ధిదారుల నుంచి రైతుబంధు సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేస్తున్నారు . రాష్ట్రం ఏర్పడిన తర్వాత విస్తృతస్థాయిలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో, కేబినెట్ సమావేశంలో మంత్రులకు తెలంగాణ ప్రజలందరికి మనం కడుపు కట్టుకొని పనిచేయాలని, ఆ పార్టీ అధినాయకుడు తమ పార్టీ నాయకులకు హితబోధ చేశారని ఆ పార్టీ కీలక నాయకులు చెప్పుకునేవారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఆస్తులను కేసీఆర్ కుటుంబసభ్యులు అడ్డగోలుగా వెనకేసుకున్న తీరును ప్రజలు గమనించారు. కేసీఆర్ కుటుంబం యథేచ్ఛగా దోచుకుంటున్న తీరుతో స్ఫూర్తి పొందిన పార్టీలోని మిగతా నాయకులు తమ తమ స్థాయిలో వీలైన మార్గాల నుంచి డబ్బు, భూమి ఎవరికి అందినంత దోచుకోవడం మొదలుపెట్టి వారి ఆస్తిపాస్తులను పెంచుకోవడం మొదలుపెట్టారు. గులాబీ నాయకుల నమ్మిన బంట్లు కొందరు ఇప్పటికే భూమి కలిగి ఉన్నా.. లావణి పట్టాల పొంది ప్రభుత్వ భూములను సొంతం చేసుకున్నారు. రైతుబంధు పథకంలో భాగంగా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుకున్నారు.
సిరిసిల్ల కేంద్రంగా లావణి పట్టాల బాగోతం
సిరిసిల్ల నియోజకవర్గం కేంద్రంగా జరిగిన లావణి పట్టాల బాగోతంలో ఉన్న స్థానిక శాసనసభ్యుని వర్గానికి చెందినవారు ముఖ్యులు కొందరిపైన ఇప్పటికే చట్ట ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు . ఇంకా ఈ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ప్రభుత్వ భూమిని కాజేసిన నాయకుల చిట్టాను ఒక్కటొక్కటిగా రెవెన్యూ అధికారులు వెలుగులోకి తెస్తున్నారు. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కలకలం మొదలైంది. కాగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిపైన, ఆయన భార్యపైన సిరిసిల్ల పట్టణ కేంద్రం రగుడు వెంకటాపూర్ బైపాస్ రోడ్డులోని ప్రైమ్ ప్లేస్ లో ప్రభుత్వ భూమిని లావణి పట్టాలు ద్వారా తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా మాధ్యమాల ద్వారా విశ్వసనీయంగా బయటకువచ్చింది. ఇదిలా ఉండగా రెవెన్యూ చట్టం ప్రకారం భూమి లేని నిరుపేదలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు ప్రభుత్వ భూమిని ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాల్సి ఉండగా సొంతంగా భూములు ఉన్నవారే ప్రభుత్వ భూమిని లావణి పట్టాల పేరుతో పొందారు. రెవెన్యూ అధికారులు చర్యలతో బెంబేలెత్తిన అక్రమార్కులు ఇప్పటివరకు సుమారు 240 ఎకరాల లావణి పట్టా భూములను జిల్లా కలెక్టర్లకు తిరిగి అప్పగించారు. అయితే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితోపాటు ఉన్నతాధికారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవలసిన విషయం ప్రత్యేకంగా ఉంది. లావణి పట్టాల అక్రమాలు కేవలం సిరిసిల్ల నియోజకవర్గానికి పరిమితమైనదా లేక మిగతా అన్ని జిల్లాల్లోనూ జరిగిందా అనేది విచారించాలి.
సమగ్ర విచారణ జరిపించాలి
లావణి పట్టాల పేరుతో అక్రమ భూముల సంతర్పణపై సంపూర్ణ సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ సర్కారుపై ఎంతైనా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్య నాయకుల నియోజకవర్గాలలో ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, సంబంధితశాఖ మంత్రివర్యులు శ్రద్ధ వహించి ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పరిగణించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ జరిగిన అవకతవకలపై విచారణకు చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ సారథ్యంలోని గత బీఆర్ఎస్ప్రభుత్వ పాలనలో 2014 నుంచి2023 డిసెంబర్ వరకు అక్రమంగా పంపిణీ చేసిన లావణి పట్టాలపైన సమగ్ర విచారణ జరిపించాలి.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
ప్రస్తుత ప్రభుత్వం చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ భూములు అవసరమైన మేరకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. ప్రభుత్వ భూములు అర్హులైన పేదలకు పంపిణీ చేయడానికి, ప్రభుత్వ పథకాలకు అవసరమైన మేరకు భూములను కేటాయించాలన్నా అందుబాటులో తగిన భూమి లేకపోవడం గమనించవలసిన విషయం. ఇట్టి భూములను ఆయా జిల్లా కలెక్టర్లు స్వాధీనం చేసుకోవడమే కాకుండా భూములను ప్రభుత్వ భూములుగా గుర్తించి తగిన సమాచారం బోర్డులో ఉంచాలి. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా ‘భూభారతి’లో నమోదు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఏమాత్రం తాత్సారం చేయకుండా భవిష్యత్తులో ఇటువంటి భూదందాలు జరగకుండా సంబంధిత నాయకుల మీద, వారికి సహకరించిన అధికారులపైన ప్రజాప్రభుత్వం చట్టపరమైనకఠినచర్యలను ప్రజాప్రయోజనాల దృష్ట్యా తీసుకోవాలి.
- జూకంటి జగన్నాథం,
కవి, రచయిత