
కడియం తన కులాన్ని .. నిరూపించుకోవాలి
శ్రీహరి తనతో పాటు ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే రమేశ్‌నూ వేధిస్తున్నరు : ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తననే కాకుండా వరంగల్ ఎంపీ పసు నూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌నూ వేధిస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. శ్రీహరి తన కులాన్ని నిరూపించుకోవాలని, దీనిపై ఎమ్మార్పీఎస్, ఎంహెచ్పీఎస్, దళిత సంఘాలు చర్చ జరపాలని ఆయన అన్నారు. సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో దళితబంధు, పాడిగేదెల రుణాల లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి రాజయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరై మట్లాడారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కలిసినట్లు తెలిసిందని, స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ ఆయనకు, వర్ధన్నపేట టికెట్ ఆయన బిడ్డ కావ్యకు ఇవ్వాలని అడిగినట్లు తెలిసిందన్నారు.
‘నీవు ఎక్కడికైనా వెళ్లు, మాదిగలతో మాత్రం పెట్టుకోవద్దు’ అని రాజయ్య అన్నారు. ఎవరు పార్టీకి విధేయులు, ఎవరు కాదు అనేది త్వరలో తెలుస్తుందన్నారు. దళిత బిడ్డలు ఎదిగితే కుట్రలు చేసే నైజం ఆయనది అని ఫైర్ అయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగా లెదర్‌పార్కు తీసుకువచ్చి దళితులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను దళితబంధు లబ్ధిదారులు సన్మానించారు. జడ్పీస్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, సర్పంచుల జిల్లా అధికార ప్రతినిధి సురేశ్‌కుమార్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సింగపురం దయాకర్, ఎంపీటీసీ నర్సింహులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గణేశ్ పాల్గొన్నారు.