హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యారు. జన్వాఢ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ కేసు దర్యాప్తులో భాగంగా రాయదుర్గంలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల నివాసం ఉంటున్న ఓరియన్ విల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే, అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారంటూ ఎక్సైజ్ అధికారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
విధులకు అటంకం కలిగించొద్దని పోలీసులు నచ్చజెప్పినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓరియన్ విల్లాకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడం.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
Also Read :- ఇక నుండి అధికారికంగా సదర్ వేడుకలు
కాగా, రాయదుర్గంలోని రాజ్ పాకాల విల్లాలో భారీగా విదేశీ మద్యం ఉందన్న అనుమానంతో పోలీసులు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. రాజ్ పాకాల విల్లాకు తాళం వేసి ఉంది. దీంతో అతడి సోదరుడు శైలేంద్ర పాకాల నివాసంలో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో శైలేంద్ర పాకాల విల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి. దీంతో ఓరియన్ విల్లాలో హైడ్రామా నెలకొంది.