- హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు లాయర్ వాదనలు
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ విచారణార్హం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు లాయర్ గండ్ర మోహన్ రావు గురువారం హైకోర్టులో వాదించారు. హైకోర్టు ఉత్తర్వులపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనని, అభ్యంతరాలుంటే స్పీకర్ అప్పీలు దాఖలు చేయాలిగానీ కార్యదర్శికాదన్నారు. అందువల్ల ఈ అప్పీలును కొట్టివేయాలని కోరారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ అంశంపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఇదివరకే ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వేర్వేరుగా 2 అప్పీళ్లు దాఖలు చేశారు.
వీటిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణను కొనసాగించింది. అనర్హత పిటిషన్‌లపై విచారణను ట్రైబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ చేపడతారని, ట్రైబ్యునల్ న్యాయవ్యవస్థలో భాగమే కాబట్టి, దాని విధులను పర్యవేక్షించే అధికారం కోర్టులకు ఉందని లాయర్ గండ్ర గుర్తుచేశారు. స్పీకర్ విధులను నిర్వహించడంలో విఫలమైనపుడు కోర్టుల జోక్యం తప్పదన్నారు.
చట్టసభల కాలపరిమితి ఐదేండ్లని, అది పూర్తయ్యేదాకా తామిచ్చిన ఫిరాయింపుల పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ పోతే ప్రజాతీర్పునకు అర్థంలేదని పేర్కొన్నారు. కాబట్టి జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ స్పీకర్ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు.