- తుమ్మల, పొంగులేటి ఎఫెక్ట్తగ్గించడంపై బీఆర్ఎస్ ఫోకస్
- సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం
- పార్టీ మారే ఆలోచనలో ఉన్నవారితో రహస్య మంతనాలు
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడంపై ఫోకస్‌పెట్టారు. కీలక సమయంలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలు పార్టీ మారకుండా చర్యలు తీసుకుంటున్నారు. క్రమంగా కాంగ్రెస్ బలపడుతోందనే అంచనాలు, ప్రచారాల నేపథ్యంలో ప్రత్యర్థుల వలలో తమ క్యాడర్ చిక్కకుండా చూసుకుంటున్నారు. ఊగిసలాటతో ఉన్నవారిని, పార్టీ మారతారేమో అన్న అనుమానం ఉన్నవారిని గుర్తించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. గ్రామాల్లో అలాంటి వారిని గుర్తించేందుకు సర్వేలు చేయిస్తున్నారు. క్యాడర్‌ను కాపాడుకోవడంతోపాటు ప్రత్యర్థిని బలహీనం చేయడమే లక్ష్యంగా నేతలు ఎత్తులు వేస్తున్నారు.
లిస్ట్ తెప్పించుకుని మరీ..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరాక, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ అభ్యర్థులకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇటీవల ఖమ్మం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బాలసానిలక్ష్మీనారాయణతోపాటు ముగ్గురు కార్పొరేటర్లు పార్టీ మారారు. ఇంకొందరు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు అలర్ట్ అయ్యారు. గ్రామాల వారీగా పార్టీ మారే అవకాశం ఉందన్నవారి డేటా తెప్పించుకుంటున్నారు.
సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. ఇలా అనుమానం ఉన్న వారితో సమావేశమై బుజ్జగిస్తున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పి పార్టీ మారకుండా చూస్తున్నారు. అలాగే గ్రామాల్లోని ఉమ్మడి కుటుంబాలు, ఎక్కువ ఓటర్లు ఉన్న కుటుంబాల గురించి ఆరా తీస్తున్నారు. అలాంటి వారు పార్టీ మారే ఆలోచన ఉందా లేదా అని సర్వే చేయిస్తున్నారు. డౌట్‌ఫుల్‌గా ఉంటే ముఖ్య నేతలతో మాట్లాడిస్తున్నారు.
పార్టీ మారలే.. బీఆర్ఎస్లోనే ఉంటం
ఖమ్మం టౌన్ : తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతామని మాజీ కార్పొరేటర్ ఊట్కూరి లక్ష్మీసుజాత, రవికాంత్ దంపతులు స్పష్టం చేశారు. గురువారం ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌నేత తుమ్మల నాగేశ్వరరావు తమ ప్రమేయం లేకుండా ఇంట్లోకి వచ్చి బలవంతంగా తమకు హస్తం పార్టీ కండువా కప్పారని, ఆ టైంలో తీసిన ఫొటోలను కాంగ్రెస్శ్రేణులు సోషల్‌మీడియాలో వైరల్చేశారని లక్ష్మీసుజాత, రవికాంత్దంపతులు చెప్పారు.
బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవాలని చూడడం కరెక్ట్‌కాదన్నారు. తాము బీఆర్ఎస్లోనే ఉంటామని, పువ్వాడ అజయ్ కుమార్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. అలాగే ముస్లిం మైనార్టీ దూదేకుల వృత్తి సంక్షేమం సంఘం ఖమ్మం సిటీ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ ఆధ్వర్యంలో 21వ డివిజన్ కు చెందిన 50 కుటుంబాలు గురువారం బీఆర్ఎస్లో చేరాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి అజయ్అన్నారు.
అలాగే 27వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాలడుగు పాపారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో అజయ్ పాల్గొన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నియోజకవర్గాల సమన్వయకర్త ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.