ఇచ్చోడ/ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నకిలీ విత్తన వ్యాపారం చేస్తూ పేద రైతులను నిలువునా ముంచుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. బీఎస్పీ ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా సభ సోమవారం ఇచ్చోడలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించగా ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోడు భూముల పంపిణీలో అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో వందల కోట్ల విలువైన భూములను రహస్య జీవోల ద్వారా బీఆర్ఎస్ నాయకులకు కట్టబెడుతోందని ఆరోపించారు. అందుకోసమే 59 జీఓ తెచ్చారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆ భూములన్నీ స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామన్నారు.
ALSO READ :కొత్త బడ్జెట్ ఇచ్చేదాకా.. బడుల్లో పాత మెనూనే పెడ్తం
జీవో 46తో 28 జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువకులు నష్టపోతున్నారన్నారు. కేవలం ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేసి హిమాన్షుతో ఓ స్కూల్బాగుకోసం కృషి చేస్తున్నట్లు ప్రయత్నం చేశారన్నారు. బాసర విద్యార్థులు ధర్నా చేసినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తమ ఫాంహౌస్ ల చుట్టూ రింగ్ రోడ్లు వేసుకున్నారే తప్ప, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్లు కూడా వేయించడం లేదన్నారు.
అలాగే ఆదిలాబాద్జిల్లా ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో ప్రవీణ్‌కుమార్ పర్యటించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తర్వాత మండల కేంద్రంలో పార్టీ ఆఫీసు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆయన వెంట లీడర్లు సీడం గణపతి, మనోహర్, జంగుబాబు, అర్చన, సోయం చెన్నయ్య ఉన్నారు.