- ఎంపీ ఎన్నికల రిజల్ట్స్తో డీలాపడిపోయిన గులాబీ నేతలు
- రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పు నిర్ణయం
- రేవంత్ అంతరంగికులతో జోరుగా సంప్రదింపులు
- బడ్జెట్ సమావేశాలలోపే జాయినింగ్స్..
- ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం నో ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల ఫలితాలతో డీలాపడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ అంతరంగికులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్ కు అత్యంత సన్నిహితులతో తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలిసింది.
అయితే, ఇందులో కొందరు ఎమ్మెల్యేలను తీసుకునేందుకు సీఎం అయిష్టత చూపుతున్నట్టు కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రభుత్వానికి లేనిపోని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో వారి చేరికకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. సిటీ శివారులోని ఒకే కుటుంబంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా.. వారిని చేర్చుకునేందుకు నిరాకరించినట్టు తెలిసింది. వారు చివరికి కర్ణాటక వెళ్లి అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కూడా కలిశారు.
అయినా వారి విషయంలో రేవంత్ ససేమిరా అనడంతో చేసేది లేక ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆరోపణలు లేని, వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యేలను మాత్రమే తాము తీసుకుంటామని సీఎం స్పష్టమైన సంకేతాలను ఇచ్చినట్టు తెలిసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోపే ఈ చేరికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.
35కు పడిపోయిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య
బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ( కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్ ) ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. దీనికి తోడు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్గెలవడంతో ఇప్పుడు గులాబీ ఎమ్మెల్యేల సంఖ్య 35కు పడిపోయింది. ఇక మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. తమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం అంటూ సీఎం రేవంత్ ను ఆయన ఇంట్లో పలు సందర్భాల్లో కలిశారు. మెదక్ ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు అప్పట్లో రేవంత్ ను కలవడం బీఆర్ఎస్ను కలవరానికి గురిచేసింది.
ఇక రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా సీఎంను కలిశారు. ఒకదశలో ఆయన చేరికకు ముహూర్తం కూడా పెట్టారు. కాని చివరి క్షణంలో తాను చేరడం లేదని ప్రకటించారు. ఇప్పుడు ఆయన విషయంలో మళ్లీ చర్చ సాగుతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఇప్పటికే సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. ఆదిలాబాద్ లో ఇద్దరు గులాబీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
నిజామాబాద్ లో ఒకరు హస్తం బాట పట్టనున్నారని చర్చ నడుస్తున్నది. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. నాలుగున్నరేండ్లు ఇలాగే ప్రతిపక్షంలో ఉంటే ఇటు నియోజకవర్గ అభివృద్ధి వెనుకబడిపోతుందని, ఇదే సమయంలో తమ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడుతుందని చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.