- వనపర్తిలో రూ.666 కోట్ల పనులకు కేటీఆర్ తో భూమిపూజకు ప్లాన్
- అక్టోబర్ 4న దేవరకద్రలో మంత్రి హరీశ్‌రావు పర్యటన
వనపర్తి, వెలుగు: ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూకుడు పెంచారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లతో ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహిస్తూ జనం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఈ నెల 29న మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అక్టోబర్ 4న కొత్తకోటలో మంత్రి హరీశ్‌రావు వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడంతో పాటు దేవరకద్ర సెగ్మెంట్లో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
ఒకే రోజు 23 పనులు..
వనపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్ రెడ్డి ఏకంగా రూ.666 కోట్లతో ఒకే రోజు 23 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో రూ.10 కోట్లతో వనపర్తిలో ఐటీ టవర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. నాలుగైదేళ్లుగా పెండింగ్ లో ఉన్న వనపర్తి–పెబ్బేరు రోడ్డు పనుల కోసం రూ.45 కోట్లు మంజూరు చేశారు. వనపర్తికి మంజూరైన జేఎన్టీయూ కాలేజీహాస్టల్ నిర్మాణం కోసం రూ.25 కోట్లతో అదే రోజు శంకుస్థాపన చేయనున్నారు. 1,540 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. వనపర్తి పట్టణానికి వచ్చే 50 ఏండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంకిరెడ్డిపల్లి గ్రామ శివారులోని బుగ్గపల్లితండా వద్ద రూ.425 కోట్లతో నిర్మించిన మిషన భగీరథ పథకాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు.
ALSO READ :- మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్‌లో ఉత్కంఠ
రూ.84 కోట్లతో పెబ్బేరు, పాన్ గల్, కొత్తకోట రోడ్లను కలుపుతూ నిర్మించే బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. వనపర్తిలో రూ.15 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో కలిపి ఒకే రోజు 23 ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం గమనార్హం. దీనిపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేస్తే సరిపోదని పనులు చేయకుండా ఇన్నాళ్లు ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అధికార పార్టీ శంకుస్థాపనలు చేస్తున్నారని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి విమర్శించారు.
నిధుల్లేక మూడేండ్లుగా వర్క్స్ పెండింగ్..
వనపర్తి పట్టణంలో మూడేళ్ల కింద ప్రారంభమైన రోడ్ల విస్తరణ పనులు నిధులు లేక పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన రహదారిని కంప్లీట్ చేసిన ఆఫీసర్లు, గోపాల్ పేట, పెబ్బేరు రూట్లలో పనులను మాత్రం పట్టించుకోవడం లేదు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. వనపర్తి రోడ్ల విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నాయి. నిధులు పూర్తి స్థాయిలో మంజూరు కాకపోవడంతో ఈ పనులు ముందర పడలేదు.