హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ మరో రీతిలో వినూత్నంగా నిరసన తెలిపారు. లగచర్ల రైతులకు మద్దతుగా మంగళవారం (డిసెంబర్ 17) చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చిన గులాబీ ఎమ్మెల్యేలు.. బుధవారం (డిసెంబర్ 18) ఆటో డ్రైవర్లకు సపోర్ట్‌గా డ్రైవర్ వేషధారణతో పాటు ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ తీసుకువచ్చి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టగొడుతోందని.. వారిని వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చిందని.. కానీ ఆ ఇప్పటికి అమలు కాలేదని విమర్శించారు. ఆర్థిక సమస్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు.
Also Read :- కరీంనగర్ డెయిరీ ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేత
గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను అందించామని.. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డట్లే ఉందని ఉందని విమర్శలు గుప్పించారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలను వెంటనే ఇవ్వాలని.. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.