బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలలో ఒక కుటుంబం కోసం, ఒక వ్యక్తి కోసం పోరాటం చేస్తున్నారు. మేం ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం. ముమ్మాటికీ ధరణిలో అక్రమాలు జరిగాయి. ధరణి కేవలం కేసీఆర్ కుటుంబం కోసం తీసుకొచ్చారు. భూ భారతి బిల్లుపై చర్చ జరగనీయకుండా అడ్డుకోవడం బీఆర్ఎస్, కేసీఆర్ సంస్కృతికి నిదర్శనం’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కాగా, 'ఫార్ములా ఈ-రేసు'పై ఏసీబీ కేటీఆర్‌పై కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ భరించలేకపోతున్నది. కేసులో ఏ-1గా కేటీఆర్‌ను చేర్చడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసనకు దిగడంతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒక దశలో స్పీకర్‌పై, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై దాడికి సాహసించారు. ఈ పరిణామాలన్నీ కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసమే జరిగాయని పరిశీలకులంటున్నారు.
ప్రజా సమస్యలపై ఇంత తీవ్రంగా బీఆర్ఎస్ ఇదివరకు స్పందించలేదు. లగచర్ల ఘటనపై కూడా ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగలేదు.
ప్రతిపక్ష పాత్రలోకి ప్రవేశించిన తర్వాత కూడా తాము చెప్పినట్లే, చట్టసభలు, ప్రభుత్వమూ నడుచుకోవాలన్న ఆధిపత్య ధోరణి బీఆర్ఎస్లో కనిపిస్తు
న్నది. ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు.
మరో వైపు ఆయన కొడుకు కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయగానే బీఆర్ఎస్ నాయకులు గంగవెర్రులెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫార్ములా ఈ- కారు రేసింగ్ ఈవెంట్లో చట్టవిరుద్ధమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను మాజీ మంత్రి కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది సుందరంను రప్పించి వాదనలు విన్పించడం దేనికి సంకేతం? తనపై పెట్టిన కేసును ఎత్తివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో కేటీఆర్ ఎంత భయపడుతున్నారో అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈడీ రంగప్రవేశంతో కీలక మలుపు
కేటీఆర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదు కావడం మరొక సంచలనం. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విలేకరుల సమావేశంలో రెచ్చిపోయి మాట్లా
డారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, మంత్రులను మంత్రులుగా గుర్తించడానికి బీఆర్ఎస్ నిరాకరిస్తున్నది. సంవత్సర కాలంగా ఆ పార్టీ వ్యవహార శైలి, పార్టీ నాయకుల పోకడలు తెలంగాణ సమాజానికి రుచించడం లేదు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల ప్రవర్తన తెలంగాణ పౌర సమాజానికి నచ్చడం లేదు. ధరణి ఎందుకు పెట్టారో, దాని ముసుగులో వేలాది ఎకరాలు ఎవరెవరి అజమాయిషీలోకి వెళ్ళాయో తెలంగాణ సమాజం తెలుసుకోవాలని అనుకుంటున్నది. ధరణి అయినా, భూ భారతి పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గురించి అయినా తెలుసుకునే హక్కు తెలంగాణ ప్రజలకుంది.
భూ భారతి చట్టం శాసనసభ ఆమోదించే సమయంలో ప్రధాన ప్రతిపక్షం సభలో లేదు. భూ భారతిపై చర్చలో పాల్గొనడం కన్నా ఫార్ములా- ఈ రేసు కేసు మాత్రమే తమకు ప్రాధాన్య అంశంగా బీఆర్ఎస్ భావించడం దురదృష్టకర పరిణామం. ఫార్ములా -ఈ రేసుకు సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. రూ. 54 కోట్ల నిధులు హెచ్ఎండీఏ సంస్థ నుంచి ఈవెంట్ నిర్వహించే సంస్థకు మళ్లించడంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ఆ సమయంలో పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆరే ప్రభుత్వం కనుక ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు అని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం మీడియా సమావేశంలో కేటీఆర్‌ను వెనకేసుకొని వచ్చారు.
కేసుల ఊబిలో కేసీఆర్, కేటీఆర్
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, తాజాగా ఫార్ములా -ఈ రేస్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు, ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్, ఫోన్ ట్యాపింగ్ కేసులు కేసీఆర్, కేటీఆర్‌లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ లిక్కరు కేసులో కవిత అరెస్టుతో ఆత్మరక్షణలో పడ్డ కేసీఆర్ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యారని గతంలో వార్తలు వచ్చాయి.
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి ప్రయత్నించినట్టు ప్రచారం సాగింది. ప్రస్తుతం చుట్టుముడుతున్న అనేక సమస్యల నుంచి బయటపడాలంటే విలీనమే సరైన మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన చర్చలు రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణంలో సాగాయని మరో ప్రచారమూ జరిగింది. అదే జరిగితే పుష్కర కాలానికిపైగా తెలంగాణ ఉద్యమాన్ని నడపడంతో పాటు, పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ఇక గతచరిత్రగానే మిగిలిపోవచ్చు.
బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ఫైర్
రైతుబంధు పేరిట అనర్హులకు కూడా దాదాపు 22 వేల కోట్లకుపైగా ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. రైతు బీమా సహా ఇతర అంశాల్లో బీఆర్ఎస్ను రేవంత్ చీల్చి చెండాడారు. పదేండ్లలో రూ.72,817 కోట్లు రైతుబంధు రూపంలో ఖర్చు చేసినా సాగులో లేని భూములకు, గుట్టలు, లే-అవుట్లకు, నేషనల్ హైవేస్‌కు కూడా రైతుబంధు ఇచ్చారనీ బీఆర్ఎస్ ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టారు. ఇప్పుడు కూడా రాళ్లకు, గుట్టలకు, రహదారులకు మనం రైతు భరోసా ఇద్దామా? అని ప్రతిపక్షాన్ని డిఫెన్స్‌లో పడేశారు.
రైతు బంధు రూపంలో వేలాది కోట్ల కొల్లగొట్టారని అన్నారు. 80వేల పుస్తకాలు చదివిన మేధస్సుతో రైతు భరోసాపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇస్తారని మేం భావించినట్టు రేవంత్ చురకలు అంటించారు. కేసీఆర్ ఏలుబడిలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని హేళన చేశారు. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రంలో ఇన్ని ఆత్మహత్యలు జరగడం సిగ్గుచేటు అన్నారు. ఏడాదిలో తాము ఏం చేశామని ఇన్నిసార్లు అడుగుతున్నారని, పదేండ్లలో కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వెనక్కి తిరిగి చూసుకోవాలని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.
ఆత్మరక్షణలో బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా.. 39 మంది ఎమ్మెల్యేల విజయంతో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో పది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ గూటికి చేరిపోయారు. బీఆర్ఎస్ఎల్పీ ‘విలీనం’పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. మరోవైపు విలీనం జరిగి ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోకముందే పార్టీని బీజేపీలో కలిపేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. అసెంబ్లీలో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లకు పడిపోవడం బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసింది.
పంచాయతీ ఎన్నికల్లో తమ పరిస్థితి ఇంకా దెబ్బతింటుందేమోనన్న భయమూ ఆ పార్టీని వెంటాడుతోంది. బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలియవచ్చింది. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నప్పుడే ఇలాంటి చర్చ జరిగిందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈ నిర్ణయాన్ని లేదా ఆలోచనను సమర్ధించనని ఆమె తేల్చి చెప్పినట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ ఉన్నది.
బెనిఫిట్ షోలు ఇక బంద్
సంధ్య థియేటర్ ఘటనపై శాసనసభలో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించడం ప్రజలను ఆకట్టుకుంది. అల్లు అర్జున్
రోడ్ షో వల్లనే ప్రమాదంలో ఒక మహిళ నిండు ప్రాణం పోయిందని, ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని బీఆర్ఎస్పై ఎటాక్ చేయడం వాస్తవాలకు అద్దంపట్టింది. సినీ పరిశ్రమకు ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ తెగేసి చెప్పిన తీరు ప్రజల మన్ననలు పొందింది.
–ఎస్. కే. జకీర్, సీనియర్ జర్నలిస్ట్–