- రెవెన్యూ శాఖలో మొదలైన హడావుడి
- 2 రోజుల కింద ఆరుగురి బదిలీ వివాదాస్పదం
నిజామాబాద్, వెలుగు: ఎలక్షన్లలో తమకు అనుకూలంగా పనిచేసే ఆఫీసర్ల కోసం రూలింగ్పార్టీ ఎమ్మెల్యేలు వేట మొదలుపెట్టారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారి ద్వారా ఆరాలు తీస్తున్నారు. రెవెన్యూ శాఖలో ఇందుకు సంబంధించిన ట్రాన్స్ఫర్ల సందడి నడుస్తోంది. ఎలక్షన్ కమిషన్నిబంధనల ప్రకారం ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తయి, జిల్లా స్థానికత ఉన్న ఆఫీసర్లు అక్కడ ఎన్నికల విధులు నిర్వహించడానికి వీల్లేదు.
సర్దుబాటుకు ప్లాన్..
అన్ని రాజకీయ పార్టీల లీడర్లు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశారు. మరోసారి పోటీకి సిద్ధమవుతున్న రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతికూలతలను సెట్చేసుకునే పనిలో పడ్డారు. తమ నియోజకవర్గాల్లోని సెకండ్ క్యాడర్ లీడర్లు, కార్యకర్తల అలకలను సరిచేసుకోడానికి బుజ్జగింపులకు దిగారు. అన్నింటికీ మించి వారి దృష్టి ఎలక్షన్లు నిర్వహించే అధికారుల పోస్టింగ్‌లపై పడింది. ఎన్నికల నోటిఫికేషన్రాకముందే తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆరుగురు తహసీల్దార్ క్యాడర్ పోస్టులకు..
రెండు రోజుల కింద తహసీల్దార్ క్యాడర్ పోస్టులకు సైలెంట్‌గా పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఇవి రెవెన్యూ శాఖలో పెద్ద దుమారం రేపుతున్నాయి. లీడర్ల కనుసన్నల్లో పెద్దాఫీసర్లు పనిచేస్తున్నారనే విషయం ఈ ట్రాన్స్ ఫర్ల ద్వారా స్పష్టమవుతుంది. ఎలక్షన్ కమిషన్నిబంధనల మేరకు బదిలీ అయ్యే అవకాశమున్న ముగ్గురు తహసీల్దార్లను కలెక్టరేట్లో సూపరింటెండెంట్లుగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్జారీ చేసి, ప్రస్తుత మండలాల్లోనే డిప్యూటేషన్‌లో తహసీల్దార్లుగా కొనసాగాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కలెక్టరేట్లోని ముగ్గురు సూపరింటెండెంట్లకు తహసీల్దార్ పోస్టుల్లో మండలాలకు ట్రాన్స్ఫర్ చేసి, యథాస్థానంలో డిప్యూటేషన్‌లో కొనసాగాలని ఆర్డర్స్ వెలువడ్డాయి. అంటే కేవలం పేపర్ల వరకే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉంటాయి.
ఇటు నేను.. అటు నువ్వు
రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో సహకారించేందుకు చాలా మంది ఆఫీసర్లు పరస్పర అవగాహనతో ట్రాన్స్ఫర్లకు సిద్ధపడుతున్నారు. ఆర్డీవో హోదాలోని రిటర్నింగ్ఆఫీసర్(ఆర్ వో), నియోజకవర్గ కేంద్రంలో తహసీల్దార్స్టేటస్లోని అసిస్టెంట్రిటర్నింగ్ఆఫీసర్ల (ఏఆర్వో) విషయంలో ఇది కనపిస్తోంది. ఆర్మూర్‌కు జగిత్యాల జిల్లా నుంచి ఒక ఆఫీసర్ ఆర్వోగా రానున్నట్లు సమాచారం. ఆయన్ను సిఫార్సు చేసిన జిల్లా ఆఫీసర్ ఖాళీ అవుతున్న అక్కడి జగిత్యాల జిల్లా పోస్టుకు వెళ్లనున్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా నుంచి ఒక ఆఫీసర్ బీఆర్ఎస్ లోని ఒక పెద్ద మనిషి కోసం ఇటు రావడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బాల్కొండకు ఎవరు?
బాల్కొండ నియోజకవర్గానికి రిటర్నింగ్ఆఫీసర్(ఆర్వో) గా ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. గతంలో జడ్పీ సీఈవో అక్కడి ఆర్వోగా వ్యవహరించేవారు. ఈ సారి మార్పులకు అవకాశం ఉందని ఆఫీసర్ల మధ్య చర్చ నడుస్తోంది. మున్సిపల్‌కార్పొరేషన్ కమిషనర్ అర్బన్ నియోజకవర్గానికి ఆర్ వోగా పనిచేస్తారు. ప్రస్తుతం ఇన్చార్జి కమిషనర్‌గా ఐఏఎస్అధికారిణి చిత్రామిశ్రా వ్యవహరిస్తుండగా, ఆమెకు ఇక్కడి ఎన్నికల విధులు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.
ఆఫీసర్ కోసం వెతుకులాట..
జిల్లాలో రెండు నియోజకవర్గాల పరిధిలో ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ చిక్కుగా మారింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉపయోగపడే రీతిలో అడ్జెస్ట్ అయ్యే వారికోసం పైస్థాయిలో అన్వేషణ కొనసాగుతోంది. ఎవరి పరిధిలో వారు తమకు అనుకూలమైన ఆఫీసర్ల కోసం వెతుకుతున్నారు.