
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్, కేపీ వివేకానందను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, పల్లా, జగదీష్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ 2024, డిసెంబర్ 6న ట్యాంక్ బండ్ మీద ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేల ఇంటి వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కొంపల్లిలోని వివేకానంద్ ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారు.
ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వకపోవడంతో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశామని హౌస్ అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఉదయాన్నే ఇంటికి వచ్చి తమ పనులకు వెళ్లకుండా ఆపేయడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు.. మోండా మార్కెట్ టకారా బస్తీలోని నివాసంలో మాజీమంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. పద్మారావు గౌడ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను సెక్యూరిటీగా ఉంచారు.