![బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది!..ఆ నలుగురి తర్వాత మరో ఇద్దరు](https://static.v6velugu.com/uploads/2024/01/brs-mlas-meeting-with-cm-revanth-reddy-is-the-talk-of-the-political-circles_TYqlAkVwZ3.jpg)
- ఆ నలుగురి తర్వాత మరో ఇద్దరు
- హాట్ టాపిక్ గా మారిన నేతల భేటీ
- సీఎంను కలవడంలో ఆంతర్యమేమిటి?
- తర్వాత రేవంత్ ను కలిసేదెవరు?
- రిటర్న్ గిఫ్ట్ కు రంగం సిద్ధమవుతోందా?
- ఎంత మంది కారు దిగుతారు..?
- సోషల్ మీడియాలో జోరుగా చర్చ
హైదరాబాద్: రాష్ట్రాన్ని శాసించిన నాయకుడు.. పదేళ్లపాటు ప్రభుత్వం నడిపిన పార్టీ..! ఒక్క ఓటమితో ఆగమవుతోంది. కారు తకరారు పడుతోంది..గులాబీ వాడిపోతోంది. వారం వ్యవధిలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ మాజీ మేయర్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వాళ్లు కూడా కలిస్తే తప్పేంటి అనే ధోరణిలో మాట్లాడటం.. దీనిపై పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలు, ప్రొటోకాల్ వివాదాల పేరుతో నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం.. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఆగమేఘాల మీద తెలంగాణ భవన్ కు పిలిపించి వాళ్లతో ప్రెస్ మీట్ పెట్టించారు పార్టీ పెద్దలు.
సదరు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంని కలిస్తే తప్పేంటి..! ఒక్క సారి కాదు వంద సార్లు కలుస్తం అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఆ వెంటనే తాము కేసీఆర్ వెంటే ఉంటామని కూడా అన్నారు. ఆ మరుసటి రోజే హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన చేరికపైనా సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరిగాయి. చివరకు తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని తీగల క్లారిటీ ఇచ్చారు. తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి కోసం మహేశ్వరం సీటును త్యాగం చేసిన తీగల.. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దాదాపు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా కారుదిగుతారనే చర్చ జోరుగా సాగుతోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన బయటికి వచ్చే లోపే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకొన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కొందరైతే ఏకంగా ప్రకాశ్ గౌడ్ కాంగ్రె స్ లో చేరినట్టే రాసేశారు.
ఎవరా 26 మంది!!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పినట్లు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారా..? అయితే ఎవరా 26 మంది అన్నదానిపై ఊహాగానాలకు తెరలేచింది. సర్కారు తీరుపై విమర్శించకుండా సైలెంట్ గా ఉంటున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు, బడా నేతలపైనే బీఆర్ఎస్ లీడర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే అక్రమాల దొంతరను కదిలించే పనిలో పడ్డారు. వీటితో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పరోక్షంగా లింకులు ఉండటం.. ఇప్పటికే అనుచరులపై యాక్షన్ మొదలు కావడంతో వ్యవహారం తమదాకా రావద్దని ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలు, రకరకాల వ్యాపారాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా..?
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(టీఆర్ఎస్) 88 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ రెండు, ఎంఐఎం 7, బీజేపీ 1, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ కు పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా.. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. టీడీపీ శాసన సభా పక్షాన్ని విలీనం చేసుకుంది. అప్పటి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కారెక్కించుకుంది. ఆ తర్వాత ఏకంగా 12 మంది కాంగ్రెస్ శాసన సభ్యులను తమ పార్టీలో చేర్చుకొంది. దీంతో 19 సీట్లు సాధించిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఏడు స్థానాల్లో గెలిచిన మజ్లిస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో అసెంబ్లీ అంతా గులాబీ మయంగా మారిందనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ ఓ సచ్చిన పీనుగు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన హస్తం పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన శైలిలోనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు తెరలేపిందా..? అన్న చర్చ మొదలైంది.
సోషల్ మీడియాలో లెక్కలు
ఎవరు కాంగ్రెస్ లో చేరుతారనే అంశంపై సోషల్ మీడియాలో లెక్కలు మొదలయ్యాయి. రకరకాల ఈక్వేషన్లు చూపుతూ విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదే అదనుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం సైతం కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగి కేసీఆరే అధికారంలోకి రాబోతున్నారంటూ కలరింగ్ ఇస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటం హాట్ టాపిక్ గా మారుతోంది.