దాదాగిరి నడ్వదు .. అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు: సీఎం రేవంత్

దాదాగిరి నడ్వదు .. అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు: సీఎం రేవంత్
  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్​, అరికెపూడి గాంధీ గొడవపై సీరియస్
  • హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌‌ను దెబ్బతీస్తే సహించేది లేదు
  • ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కుట్రలు
  • అట్ల చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • లా అండ్​ ఆర్డర్​పై డీజీపీ, ఉన్నతాధికారులతో సీఎం ఆరా
  • ప్లాన్​ ప్రకారమే బీఆర్​ఎస్​ గొడవలకు దిగిందన్న ఇంటెలిజెన్స్​
  • ఆ వివరాలను సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు


హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఎవరు ప్రయత్నించినా ఊరుకోవద్దని పోలీసు అధికారులను సీఎం రేవంత్​​రెడ్డి ఆదేశించారు. దాదాగిరి నడ్వదని తేల్చిచెప్పారు. హైదరాబాద్​లో ఇటీవల ఇద్దరు బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు పాడి కౌశిక్​రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న గొడవలు, దారితీసిన పరిణామాలపై ఆయన సీరియస్ అయ్యారు. వాళ్ల రాజకీయాల కోసం ఇష్టమొచ్చినట్టు దాదాగిరి చేస్తామంటే నడ్వదని, అందులోనూ హైదరాబాద్​లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సీఎం హెచ్చరించారు. డీజీపీ జితేందర్​ సహా ఇతర ఉన్నతాధికారులను సీఎం రేవంత్​రెడ్డి పిలిపించుకొని మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్​ను దెబ్బతీస్తే ఊరుకోవద్దని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్​ రెడ్డి ఎపిసోడ్​పై పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని కూడా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినట్టు సమాచారం.  

అలజడి సృష్టించేలా బీఆర్ఎస్​ కదలికలు

సీఎం రేవంత్​ ఢిల్లీ పర్యటనలో ఉన్న రోజు (ఈ నెల 12న) హైదరాబాద్​లో ఏదో జరిగిపోతుందన్నట్టుగా ప్రతిపక్ష బీఆర్​ఎస్​ లీడర్ల కదలికలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా గొడవలను ప్రేరేపించారని పోలీస్​ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ‘‘ఆ రోజంతా ఏదో ప్రజా సమస్యపై పోరాడినట్టు కొందరు బీఆర్​ఎస్​ పెద్ద లీడర్లు హైడ్రామా నడిపించారు. కౌశిక్​రెడ్డి, అరికపూడి గాంధీ వ్యక్తిగత గొడవను సంబంధం లేని కాంగ్రెస్​కు ముడిపెట్టి.. బీఆర్ఎస్​ కేడరంతా హైదరాబాద్​కు తరలిరావాలని బీఆర్​ఎస్​ పెద్ద లీడర్లు పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో ఒక ప్లాన్​ ప్రకారం లా అండ్​ ఆర్డర్​ను దెబ్బతిసేలా బీఆర్​ఎస్​ కేడర్​ను రెచ్చగొట్టారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్​లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఎస్టాబ్లిష్​ చేసేలా వారి చర్యలు ఉన్నాయి’’ అంటూ ఇంటెలిజెన్స్​ఇచ్చిన రిపోర్టునూ సీఎం వద్ద ఉన్నతాధికారులు ప్రస్తావించినట్టు సమాచారం. బీఆర్ఎస్​చర్యల వెనుక హైదరాబాద్​లో శాంతి భద్రతలను దెబ్బతీయాలనే కుట్ర ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నదని సీఎం దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. 

ఎంతటివారైనా వదలొద్దు

తాజా పరిణామాలపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు చెప్పినదంతా విన్న సీఎం రేవంత్​.. తమ ప్రభుత్వం హైదరాబాద్​ అభివృద్ధికి పెద్దపీట వేస్తుండడం, ముఖ్యంగా హైడ్రా, మూసీ రివర్​ డెవలప్​మెంట్​, ఫ్యూచర్​ సిటీ లాంటి ప్రాజెక్టులకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కొందరు హైదరాబాద్  ఇమేజ్​ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్​ తీరును ఇన్నాళ్లూ సహించామని.. కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకోరాదని, అలాంటివాళ్లు ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్​ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. శాంతి భద్రతలను కాపాడే విషయంలో ప్రభుత్వం ఎంతో సీరియస్​గా ఉందని, చిన్నపాటి సంఘటనలకు కూడా తగిన సమాధానం ఇవ్వాలని డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులకు సీఎం స్పష్టంచేసినట్టు తెలిసింది.