నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • మహిళలకు సీఎం సారీ చెప్పాలని నినాదాలు 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి శాసనసభ సమావేశాలకు అటెండ్ అయ్యారు. పోడియం వద్దకు వెళ్లి సీఎం డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు చేశారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అవమానించారని ఆరోపిస్తూ  వాయిదా తీర్మానం ఇచ్చారు. 

వారికి  సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని..సభలో సబితకు మాట్లాడే చాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేలపై కూర్చొని నిరసన తెలిపారు. బీజేపీ పక్షనేత మాట్లాడే సమయంలో బడే భాయ్​చోటే భాయ్​ అంటూ నినాదాలు చేశారు. ఉదయం 10.25గంటల నుంచి రెండు గంటల పాటు సభలో గంధరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. దాంతో బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ ప్రసాద్​కుమార్​ మండిపడ్డారు. 

పోడియం నుంచి కేటాయించిన ప్లేస్​లోకి పోతేనే మైక్​ఇస్తానని తేల్చి చెప్పారు. అయినా బీఆర్ఎస్​సభ్యులు నిరసన ఆపలేదు. ఎస్సీ వర్గీకరణపై సీఎం ప్రకటన తరువాత.. బీఆర్ఎస్​ సభ్యుడు హరీశ్​రావుకు స్పీకర్​మాట్లాడే అవకాశం కల్పించారు. ఆయన ఎస్సీ వర్గీకరణపై మాట్లాడగానే కొందరు బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత మహిళా సభ్యులు వారి స్థానాల్లో నిలబడి సభ వాయిదా పడే వరకు నిరసన కొనసాగించారు.