త్వరలోనే కాంగ్రెస్‎లోకి BRS ఎమ్మెల్యేలు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు తమతో టచ్‎లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్‎లో చేరనున్నారన్నారు. గురువారం గాంధీ భవన్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్‎లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమని, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి బీఆర్ఎస్ ఫిరాయింపులకు పాల్పడిందని అన్నారు. 

హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కానీ కౌశిక్ రెడ్డి వాడిన భాష ఎలా ఉందో అందరూ చూశారన్నారు. వారిని కట్టడి చేయకుండా కేసీఆర్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మార్క్ పాలన సాగుతుందని, పదేండ్లలో బీఆర్ఎస్ పది శాతం అభివృద్ధి చేస్తే, పది నెలల్లో కాంగ్రెస్ వంద శాతం అభివృద్ధి చేసి చూపించిందన్నారు.