
- గంట ముందే మకాం వేస్తున్న లీడర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడుతున్నారు. సభ కొనసాగే సమయంలో మీడియా పాయింట్ లో మాట్లాడేందుకు అవకాశం లేదు. సభ వాయిదా పడిన సమయంలో మాత్రమే మాట్లాడేందుకు వీలుంది. దీంతో సభ వాయిదా పడక ముందే మీడియా పాయింట్ వద్ద సభ్యులు క్యూ కడుతున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద, విజయుడు, డాక్టర్ సంజయ్ మీడియా పాయింట్ వద్ద ఎదురు చూశారు.
సీఎం స్పీచ్ ముగియగానే సభ వాయిదా పడుతుందని ముందుగా వారు అక్కడికి చేరుకున్నారు. అయితే.. సీఎం ప్రసంగం తరువాత బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు మాట్లాడారు. ఆ తరువాత వారికి సీఎం రిప్లై ఇచ్చారు. కాసేపటికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. దీంతో గంటసేపు మీడియా పాయింట్ లో బీఆర్ఎస్ నేతలు వెయిట్ చేశారు. చివరి నిమిషంలో లంచ్ కోసమని వెళ్లారు. ఆ వెంటనే సభ వాయిదా పడటంతో తిరిగి వచ్చి మాట్లాడారు. వెయిటింగ్ చేయడం వల్ల లంచ్ కూడా చేయలేకపోయామని ఎమ్మెల్యేలు చెప్పారు.
1.20 లక్షలు దాటిన ఎప్ సెట్ అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, బీఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీజీఎప్ సెట్ అప్లికేషన్లు లక్ష దాటాయి. శనివారం సాయంత్రానికి 1,20,333 అప్లికేషన్లు వచ్చినట్టు ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీంట్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ కు 34,541 మంది, ఇంజినీరింగ్ స్ర్టీమ్ కు 85,702 మంది, రెండింటికి 90 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 1న అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4 వరకూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే, ముందుగా అప్లై చేసుకుంటే.. ఎంపిక చేసుకున్న సిటీల్లో సెంటర్లు పడే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు ప్రతిరోజూ సుమారు 8వేల నుంచి పది వేల మంది వరకూ దరఖాస్తు చేసుకుంటున్నారు.