- పార్టీని వీడేందుకు సిద్ధమైన పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు
- ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి
- కాంగ్రెస్‌తో కొందరు, బీజేపీతో మరికొందరి చర్చలు
- ఎంపీపీని బతిమాలి ఆపిన ఎమ్మెల్యే పైళ్ల అనుచరులు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో మూడోసారి గెలిచి హాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ లీడర్లు చుక్కలు చూపిస్తున్నారు. తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ప్రజాప్రతినిధులు, నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు కాంగ్రెస్, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. ఇదంతా గమనిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు అసంతృప్తులను నయానో... భయానో.. బుజ్జగిస్తున్నారు.
పట్టించుకోకపోవడంతోనే..
భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పట్ల వ్యక్తిగతంగా వ్యతిరేకత లేకున్నా.. తమను పట్టించుకోవడం లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీకి చెందిన భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్లు , ఆయా గ్రామాల్లోని సర్పంచులు తమను ఏ విషయంలోనూ ఎమ్మెల్యే సంప్రదించడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ నేతలుకౌన్సిలర్లతో తమ పార్టీలోకి రావాలని చర్చలు జరుపుతున్నారు.
ఈ విషయంలో బీజేపీ లీడర్లు కూడా అలర్ట్ అయ్యారు. బీబీనగర్ మండల పరిధిలోని కొందరు సర్పంచ్‌లతో బీజేపీ నేతలు, వలిగొండ పరిధిలోని సర్పంచులతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇందుకు కొందరు సమ్మతి కూడా తెలిపినట్లు సమాచారం. ఇది బీఆర్ఎస్ లీడర్లకు తెలియడంతో కౌన్సిలర్లను బతిమిలాడే పనిలో పడ్డారు.
ఎంపీపీని బతిమిలాడి..
భువనగిరి నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా ఓ బీఆర్ఎస్ ఎంపీపీ.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారు. ముందు నుంచీ అంటీముట్టనట్లుగానే ఉంటున్న ఆయన ఎన్నికలు రావడంతో కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారు. ఈ మేరకు ఆ పార్టీ లీడర్లతో చర్చలు కూడా జరిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి అనుచరులు రంగంలోకి దిగారు. ఎంపీపీతో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరకుండా నిలువరించారు.
గుర్రు మీదున్న క్యాడర్
ఎమ్మెల్యేల తీరుపై బీఆర్ఎస్ క్యాడర్గుర్రుగా ఉంది. గత ఎన్నికల తర్వాత ఎప్పుడూ తమను పట్టించుకున్న పాపాన పోలేదని కార్యకర్తలు అంటున్నారు. ఈ ఐదేండ్లులో ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్న కొందరు మాత్రమే లబ్ధి పొందారని పథకాలు, ఇతర బెనిఫట్స్ వారికే ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే.. పార్టీ కోసం పని చేయాలని సుద్దులు చెబుతున్నారని మండిపడుతున్నారు. కొందరు వ్యక్తులు ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండి ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.