- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు గాజులు, చీరలు పంపిస్తున్నానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా దమ్ముంటే పదవులకు రాజీనామా చేయాలని, లేకుంటే తాను పంపుతున్న చీర కట్టుకుని, గాజులు వేసుకోవాలని సవాల్‌చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మొగోళ్లు కాదంటూ కౌశిక్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పూటకో పార్టీ మారే బిచ్చగాడు దానం నాగేందర్ అని, శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని దుయ్యబట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పుతో గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు అని, బైపోల్ లో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని అన్నారు.
తాము నాడు చట్టప్రకారమే కాంగ్రెస్ ఎల్పీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నామని, విడివిడిగా ఎమ్మెల్యేలను చేర్చుకోలేదని తెలిపారు. విడివిడిగా చేర్చుకున్నట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. పీఏసీ చైర్మన్‌గా నియమితులైన అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అయితే తెలంగాణ భవన్ కు రావాలని డిమాండ్ చేశారు.
ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడు: శోభారాణి
మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి హెచ్చరించారు. బుధవారం గాంధీ భవన్ లో ఆమె మీడియా సమావేశంలో ఆయనకు చెప్పు చూపుతూ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు గాజులు, పూలు పంపుతానంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. గాజులు, పూలు అంటూ మహిళలను తక్కువ చేసి మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని ఫైర్ అయ్యారు. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు.
పాడి కౌశిక్ రెడ్డి కాదు.. పిచ్చి కౌశిక్ రెడ్డి: రాగమయి
పాడి కౌశిక్ రెడ్డి కాదు.. పిచ్చి కౌశిక్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి ఫైర్ అయ్యారు. ఆయనకు మతిస్థిమితం తప్పి బీఆర్ఎస్ ఆఫీసులో తిరుగుతున్నారని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘‘కౌశిక్ రెడ్డి తలతిక్కగా మాట్లాడుతున్నాడు. మహిళలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతానని ఆయన చేసిన కామెంట్స్ నీచంగా ఉన్నాయి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కౌశిక్ తీరు ఉంది. మహిళల మనోభావాలను అవమానించారు. చీర, గాజులు వేసుకునే మహిళలు అంటే కౌశిక్ రెడ్డికి అంత చులకనగా కనిపిస్తున్నారా”అని ఆమె ప్రశ్నించారు.