- నేనొస్తున్న అంటే గోకే వాళ్లు.. గీకే వాళ్లు పారిపోవాల్సిందే!
- స్టేషన్ఘన్పూర్ లో అభ్యర్థి మార్పు తథ్యం
- ఆశీర్వదిస్తే ఘన్పూర్ను అభివృద్ధి చేస్తా
- తప్పుచేయను.. సెగ్మెంట్కు చెడ్డపేరు తేను
- ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
వరంగల్: ‘నేను స్టేషన్ ఘన్ పూర్ కు వస్తున్నా అంటే.. గోకే వారు, గీకే వాళ్లు, భూ కబ్జాదారులు పారిపోవాల్సిందే’అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం (ఆగస్టు 18న) స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కడియం శ్రీహరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజల రాజకీయ భిక్ష వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్టు చెప్పారు. తాను చెడు ప్రవర్తనతో ప్రజలకు, కార్యకర్తలకు తలవంపులు తెచ్చే పని చేయలేదన్నారు.
తాను తప్పు చేయనని భరోసా ఇస్తున్నట్టు చెప్పారు కడియ. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. అందులో స్టేషన్ ఘన్ పూర్ ఒకటన్నారు. మార్పు జరిగి నాకు అవకాశం వస్తే నిండు మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది.. నాకు అవకాశం వస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని చెప్పేలా పనిచేస్తా’అని చెప్పారు.