రేపు బీసీ మహాసభ: కవిత పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసేందుకు సర్కారుపై ఒత్తిడి తెచ్చేలా ఈ నెల 3న నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను బుధవారం ఆమె విడుదల చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.
బీసీ మహాసభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభకు సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరికొన్ని ప్రజాసంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీల కోసం కవిత చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు.