రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి : ఎమ్మెల్సీ కవిత

  • కులగణను పకడ్బందీగా నిర్వహించాలి

హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందేనని బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను నామమాత్రంగా చేస్తున్నదని, పకడ్బందీగా నిర్వహించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. శుక్రవారం ఆమె తన నివాసంలో తెలంగాణ జాగృతి సభ్యులతో సమావేశం నిర్వహించారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి ఆమె రాజకీయ కార్యాచరణను ప్రకటించే దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. సమాజంలో అంతరాలను రూపుమాపడానికి, బలహీనవర్గాలను మరింతపైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కుల సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్‌‌కు నివేదిక అందించాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలో కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని నెలల క్రితం జాగృతి అధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించారు. తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల అభిప్రాయాల మేరకు జాగృతి ఓ నివేదికను రూపొందించింది. త్వరలోనే డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్లును కలిసి కవిత ఆ నివేదికను సమర్పించనున్నారు.