హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని ఆమె శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం ప్రోద్బలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని, ఈ దాడి పిరికిపంద చర్యేనన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పదేపదే చెప్పే మొహబ్బత్ కీ దుకాణ్ అనేది ఒక బూటకమని ఈ ఘటనతో తేలిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన యువజన విభాగాన్ని గూండాల విభాగంగా తీర్చిదిద్దుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.