15 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్త : కవిత

15 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్త : కవిత
  • ఎప్పటికైనా నిజమే గెలుస్తది
  • తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కామెంట్

న్యూఢిల్లీ/ హైదరాబాద్, శంషాబా, వెలుగు:  రానున్న 15 రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తొలుత పార్టీ నేతలు, కార్యకర్తలకు సమయం కేటాయిస్తానని తెలిపారు. మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఆమె.. నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​కు వెళ్లారు. తర్వాత బుధవారం ఉదయం పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. 

మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్నారు. అనంతరం సోదరి కవిత, ఇతర పార్టీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయం గెలిచిందని, తన పోరాటం ఇంకా కొనసాగుతుందని అన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తదని ధీమా వ్యక్తం చేశారు.

సీబీఐ కేసులో కోర్టు ముందు హాజరైన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్​షీట్​పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి వర్చువల్ మోడ్​లో కవిత ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు. ఈ కేసు వ్యవహారంలో జూన్ 7న కవితతో పాటు, మరో నలుగురిపై సీబీఐ సప్లిమెంటరీ చార్జ్​షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్ షీట్ ను జులై 22న కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. 

అలాగే, అంతకు ముందు మనీశ్ సిసోడియా, అమన్ దీప్ దళ్, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రుపై సీబీఐ అదనపు చార్జ్​షీట్ వేసింది. ఈ చార్జ్​షీట్లపై బుధవారం సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్​షీట్​లో కొన్ని డాక్యుమెంట్లు స్పష్టంగా లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీగా ఉన్న డాక్యుమెంట్స్ డిఫెన్స్ లాయర్లకు ఇవ్వాలని నిందితుల తరఫు అడ్వకేట్లు జడ్జిని కోరారు. 

ఈ విజ్ఞప్తిపై స్పందించిన స్పెషల్ జడ్జి కావేరి బవేజా.. సెప్టెంబర్ 4లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ ను ఇవ్వాలని ఆదేశించారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. తర్వాత కవిత.. హైదరాబాద్ కు బయలుదేరారు. ఆమె వెంట భర్త అనిల్, కొడుకు ఆదిత్య, సోదరుడు కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.

కడిగిన ముత్యంలా బయటకు వచ్చా

తన విషయంలో న్యాయమే గెలిచిందని, ముందు నుంచీ చెప్తున్నట్లే కడిగిన ముత్యంలా బయటకొచ్చానని లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత చెప్పారు.  బుధవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, కొడుకు ఆదిత్యతో కలిసి ఢిల్లీ నుంచి ఫ్లైట్‌‌లో హైదరాబాద్​చేరుకున్నారు. శంషాబాద్​ఎయిర్‌‌‌‌పోర్టు వద్ద ఆమెకు బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా బంజారాహిల్స్‌‌లోని తన నివాసానికి కవిత చేరుకున్నారు. 

తల్లి శోభమ్మను ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో తన సోదరుడు కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన విషయంలో న్యాయం గెలిచిందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. కష్ట సమయంలో కేసీఆర్ కు, తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ప్రజా సమస్యలపై ప్రజా క్షేత్రంలో తను కొట్లాడుతూనే ఉంటానని అన్నారు. ఇక నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని పేర్కొన్నారు. కాగా..గురువారం ఉదయం కవిత ఎర్రవెల్లిలోని ఫామ్‌‌హౌజ్‌‌కు వెళ్లి తన తండ్రి కేసీఆర్‌‌‌‌ను కలవనున్నారు.