ఉద్యమం నాటి తెలంగాణ తల్లినే ఆరాధిస్తం : ఎమ్మెల్సీ కవిత వెల్లడి

ఉద్యమం నాటి  తెలంగాణ తల్లినే ఆరాధిస్తం : ఎమ్మెల్సీ కవిత వెల్లడి
  • ఎమ్మెల్సీ కవిత వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లినే తాము ఆరాధిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి ఊర్లోనూ ప్రతిష్ఠిస్తామన్నారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగన్న వ్యాఖ్యలను కాంగ్రెస్​ నేతలు వెనక్కు తీసుకొని తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కవిత.. తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్టు ఉంటుందని, అలాంటి బతుకమ్మను దూరం చేశారని విమర్శించారు. ‘‘అందరం కలిస్తేనే అందమైన బతుకమ్మ. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశాన్ని బతుకమ్మ ఇస్తుంది. అలాంటి బతుకమ్మ లేకుంటే సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుంది?’’ అని ఆమె ప్రశ్నించారు. 

ఒక చేతిలో జొన్నకంకులు, మరో చేతిలో బతుకమ్మ ఉన్న తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు ప్రచురిస్తాం. నోట్​బుక్స్, రైటింగ్​ ప్యాడ్స్​పై తెలంగాణ తల్లిని ముద్రించి పిల్లలకు ఇస్తాం. తెలంగాణ తల్లిని ఆరాధించే కార్యక్రమాలను మొదలుపెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఇకపై కాంగ్రెస్​ మాతగానే పిలుస్తాం’’అని కవిత స్పష్టం చేశారు.