రేవంత్.. నీ గురువులకే కేసీఆర్ చుక్కలు చూపించిండు: ఎమ్మెల్సీ కవిత

రేవంత్.. నీ గురువులకే కేసీఆర్ చుక్కలు చూపించిండు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి.. ఆయన ఒక వేగుచుక్క అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్​ హయాంలో నిధులు వరదలయ్యి పారేవని, ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని సెటైర్ ​వేశారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో జరిగిన కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో యథా రాజా.. తథా ప్రజా అన్నట్లుగా పాలన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి.. నీ గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్. ఆయన మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోం’ అని హెచ్చరించారు.

కవితకు థ్యాంక్స్​
ఎమ్మెల్సీ కవితను అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కలిశారు. కులగణనపై ఇటీవల బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ ‘బ్రిటిష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాని మోదీ జీఎస్టీ విధించడం దౌర్భాగ్యం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రీయింబర్స్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.