తప్పుడు సమాధానాలు ఇస్తున్నరు

తప్పుడు సమాధానాలు ఇస్తున్నరు
  • అసెంబ్లీ మీడియా పాయింట్ లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌

మండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రులు తప్పుడు సమాధానాలు ఇస్తున్నారు. మూసీ కోసం  ప్రపంచ బ్యాంకును డబ్బులు అడగలేదని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. సెప్టెంబర్‌‌‌‌లో ప్రపంచబ్యాంకును మూసీ కోసం రుణం అడిగినట్టు నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ప్రపంచబ్యాంకుకు సెప్టెంబర్ 19న ఇచ్చిన నివేదికలో డీపీఆర్ ఉంది. ఎవరి లాభం కోసం అబద్ధం చెబుతున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ప్రపంచ బ్యాంకును తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తోందని విమర్శించారు.

అదానీతో ఒప్పందాలు రద్దుచేసుకోవాలి: హరీశ్ రావు

అదానీపై సీఎం రేవంత్ రెడ్డి పోరాటం నిజమైతే.. అతనితో చేసుకున్న రూ.12 వేల కోట్ల ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి, ఆదానీ ఫొటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. వాళ్లు మాత్రం అదే అదానీకి వ్యతిరేకంగా చలో రాజ్ భవన్ చేపట్టారు. అక్కడ అదానీ గురించి మాట్లాడకుండా కేసీఆర్ గురించి మాట్లాడారు. అదానీకి రెడ్ కార్పెట్ వేసి.. తెలంగాణ పరవును, రాహుల్ గాంధీ పరువును రేవంత్ రెడ్డి మంటకలిపారు. రేవంత్ రెడ్డి అదానీకి  ఏజెంట్ లా పని చేస్తున్నారు. రోడ్డుపై మాత్రం సర్కస్ ఫీట్లు చేస్తున్నారు.  


రాజ్​భవన్​ను ముట్టడిస్తే.. హరీశ్​కు ఏం నొప్పి: విప్ ఆది శ్రీనివాస్

రాజ్​భవన్​ను ముట్టడిస్తే.. బీజేపీ నాయకులు స్పందించాలి కానీ.. హరీశ్ రావుకు ఏం నొప్పి. దీన్ని బట్టి బీజేపీ, బీఆర్ఎస్ భాయి భాయి అని స్పష్టమవుతోంది. దేశ సంపద దోచుకుంటున్న అదానీపై జేపీసీ  వేయడానికి మేము అసెంబ్లీలో చర్చ పెడతం. మాకు మద్దతు ఇవ్వండి. చట్ట వ్యతిరేక ఒప్పందాలు ఒక్కటి కూడా మేము ఆదానీతో చేసుకోలేదు. దేశంలోని పోర్టులు ఆదానీకి అప్పగించారు. పదేండ్ల క్రితం 600 స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు మూడో స్థానానికి ఎలా ఎదిగాడో బీజేపీ నేతలు చెప్పాలి. హరీశ్ రావు వైఖరి చూస్తుంటే బీజేపీకి బీ టీమ్ అన్నట్టు కనిపిస్తున్నది. అయితే, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోండి. నిరసన పేరుతో రోజుకో రకంగా  బీఆర్ఎస్​ వాళ్లు సభా సమయాన్ని వృథా చేస్తున్నారు.  

కేసీఆర్  అసెంబ్లీకి వచ్చి చర్చల్లోపాల్గొనాలి: బల్మూరి వెంకట్ 

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలి. చట్ట సభలను, రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి.  బావా, బామ్మర్దులు బలహీన వర్గాల ఎమ్మెల్యేలకు సంకెళ్లు వేసి.. వాళ్లిద్దరు దొరల లెక్క వెనక వచ్చారు. సంకెళ్లు పడేది ముందే ప్రాక్టీస్ చేసినట్టు ఉంది. ఏ అంశం మాట్లాడిన నన్ను లోపల వేస్తారని కేటీఆర్ అంటున్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దాని ప్రకారమే చర్యలు ఉంటాయి.  అసెంబ్లీలో మేము ప్రతి అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నం. చేసిన తప్పులు అంగీకరించకపోవడం మరో తప్పు. మాట్లాడే ముందు పది సంవత్సరాలు మీరు ఏ విధంగా వ్యవహరించారో చర్చ పెట్టాలి.  

రాజ్ భవన్ ముట్టడి రాజ్యాంగ విరుద్ధం కాదా?: మహేశ్వర్ రెడ్డి  

సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ను ముట్టడించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లీడ్ తీసుకొని చేయాలి. కానీ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి.. ఒక ముఖ్యమంత్రి ఇలా చేయడం ఏంటి? రాహుల్ గాంధీ మెప్పు కోసం వంద కోట్లు మళ్లీ అదానీకి ఇచ్చేశారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి దూరం పెరిగి.. సీఎం పదవిని కాపాడుకోవడానికే ధర్నా చేశారు. తెలంగాణకు సీఎం రాహుల్ గాంధీనా.. లేక రేవంత్ రెడ్డినా చెప్పాలి. నరేంద్ర మోదీని ఏదో విధంగా విమర్శించడానికి, బీజేపీని బద్నాం చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?: పాయల్ శంకర్

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వ వ్యవహారంపై ఆశ్చర్యమేస్తోంది.  కాంగ్రెస్ కు ఓటేసినందుకు ప్రజలు బాధ పడుతున్నారు. రాష్ట్రాన్ని పాలించేవారే రాజ్ భవన్ ముట్టడికి వెళ్తారా? సీఎం రాజ్ భవన్ ముట్టడికి పోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంటి? అసెంబ్లీ  సమావేశాల నుంచి తప్పించుకోవడం కోసమే రాజ్ భవన్​ను ముట్టడించారు.  

ప్రజలు గమనిస్తున్నరు:మట్టా రాగమయి 

బీఆర్ఎస్ నేతల హడావిడిని ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీ సాగకుండా బీఆర్ఎస్ వాళ్లు ప్రతి రోజూ డ్రామాలు చేస్తున్నారు. గడిచిన పదేండ్లలో వాళ్లు ఆటో కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు ఈ పథకం ద్వారా నెలకు రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు లబ్ధి పొందుతున్నారు.