ఢిల్లీ లిక్కర్ స్కామ్ : కవిత బెయిల్ పిటిషన్ వాయిదా

ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్  జైల్లో  ఉన్న  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. కవిత తరఫున న్యాయవాదులు సింఘ్వీ, నితేశ్ రాణా వాదనలు వినిపించారు. 18 నెలల ముందు దాఖలు చేసిన చార్జిషీట్ లో, అడిషన్ చార్జి షీట్లలో నిందితురాలిగా కవిత పేరు లేదని, ఆమె సమన్లకు స్పందించి విచారణకు సహకరించినప్పటికీ అరెస్టు చేశారని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. మహిళల విచారణకు సంబంధించిన కేసు ట్రయల్ సందర్బంగా సెప్టెంబర్ 15వ తేదీ వరకు సమన్లు ఇవ్వబోమని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిందన్నారు. 

ఈ కేసు విచారణ మార్చి 19న సుప్రీంకోర్టులో విచారణ ఉండగా.. ఒక్క రోజు ముందే కవితను అరెస్టు చేశారని చెప్పారు. మర్డర్ నెస్సెసిటీ ఉంటే అరెస్ట్ చేయాలన్న నిబంధనను ఈడీ అతిక్రమించిందని చెప్పారు. ఉగ్రవాదుల విషయంలో చేయొచ్చు కానీ,  ఒక మహిళ విషయం లో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పడు బెయిల్, మధ్యంతర బెయిల్ అంశంలో ఈడీ టెక్నికల్ ఇష్యూలు చెప్పడం విడ్డూరంగా ఉందని సింఘ్వీ వ్యాఖ్యానించారు. ఈ కేసులో 9 స్టేట్ మెంట్లు ఒక రకంగా ఉంటే పదో స్టేట్  మెంట్ మరో విధంగా ఉందన్నారు. బుచ్చిబాబు మొదటి స్టేట్ మెంట్ లో కవితకు వ్యతిరేకంగా మొదట్లో ఉన్నా.. తర్వాత ఇతర స్టేట్ మెంట్లలో విభిన్నత ఉందని చెప్పారు. 

అరుణ్  పిళ్లయ్ తన స్టేట్ మెంట్ ను ఉపసంహరించుకున్నారని చెప్పారు. పిళ్లై తొమ్మిది సార్లు ఇచ్చిన స్టేట్ మెంట్లో కవిత పేరు చెప్పనే లేదని అన్నారు. ఆ తర్వాత కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 18 నెలల తరువాత కవితను అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు.  బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలంలో  విజయ్ నాయర్ తో జరిగిన సమావేశాల తేదీల గురించి తెలీదని చెప్పారని సింఘ్వీకోర్టుకు విన్నవించారు. కానీ బుచ్చిబాబు కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని తెలుపుతూ అరెస్టు  చేశారని వివరించారు. తాము అన్ని అంశాలను పొందు పర్చి ఆన్ టైంలోనే సమాధానం ఇచ్చామని ఈడీ తరఫు  న్యాయవాది కోర్టుకు  తెలిపారు. 

ఈ అంశంపై మరో రోజు వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఇరు పక్షాలకూ సూచించారు. ఈ నెల 4వ తేదీ తర్వాత వాదనలు వింటామని చెప్పారు. అంతవరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరఫు న్యాయవాది సింఘ్వీ కోర్టును కోరారు. మెరిట్ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎలాంటి మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు. ఈ అంశాన్ని కోర్టు పరిధిలోనే ఉంచుతామని, ఈ నెల 4న వాదనలు వినిపించాలని సూచించారు.

ALSO READ :- BAN vs SL: ఈజీ క్యాచ్ మిస్.. ముగ్గురు చేతిలో దోబూచులాడిన బంతి