- దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ కూడా
- కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం మరోసారి రౌస్ ఎవెన్యూ (ట్రయల్) కోర్టులో హాజరు కానున్నారు. గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు.
లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే... ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ట్రయల్ కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఏప్రిల్ 10న కవితతోపాటు చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ను నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 29న ఆ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీచేశారు.
అలాగే కవిత, చరణ్ ప్రీత్ ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉండడంతో వారికి న్యాయస్థానం ప్రొడక్షన్ వారంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ జూన్ 3న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా జూన్ 3వ తేదీతోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితతోపాటు మిగిలిన వారిని సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
మరోవైపు లిక్కర్ స్కామ్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసుకున్న పిటిషన్లపై వాదనలు ముగించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.