
- గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పారని ఫైర్: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలకు గాంధీ కుటుంబం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా? అని ఆమె నిలదీశారు. గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారని, స్థానిక కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు.
ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం బాధ్యత తీసుకొని తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ మీడియాతో కవిత మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని, ఎన్నికల సమయంలో గాంధీ కుటుంబం వచ్చి ఇచ్చిన హామీల అమలు ప్రస్తావనే లేదని విమర్శించారు. అబద్ధాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.