11 నెలల కాంగ్రెస్ ​పాలనలో.. 42 మంది స్టూడెంట్లు మృతి : ఎమ్మెల్సీ కవిత

  • విద్యార్థుల సమస్యలపై సీఎం దృష్టి పెట్టాలి
  • నిమ్స్​లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజకు పరామర్శ 

పంజాగుట్ట, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 42 మంది విద్యార్థులు మృతిచెందారని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు. కుమ్రంభీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వాంతులు, విరేచనాలతో అస్వస్థకు గురై  నిమ్స్​లో చికిత్స పొందుతున్న 9వ తరగతి విద్యార్థిని శైలజను శనివారం బీఆర్ఎస్​పార్టీ నాయకులు మన్నె గోవర్దన్​ రెడ్డితో కలిసి కవిత పరామర్శించారు. వారి కుటంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాల్లో జరుగుతున్న విద్యార్థుల మృతులపై సీఎం రేవంత్​రెడ్డి దృష్టి పెట్టాలన్నారు.  ఆదిలాబాద్​ నుంచి ఆలంపూర్​ వరకు ఏదో ఒక కారణంతో పాఠశాలలో విద్యార్థులు మృతి చెందారన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి 10 నిమిషాలు సమయం కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. 

ఇటీవల నారాయణ్​ పేట్​హాస్టల్​లో విద్యార్థులు తింటున్న అన్నంలో  పురుగు కనిపిస్తే సీఎం స్పందించారని, అయినా హాస్టళ్లలో సమస్యలు వస్తూనే ఉన్నాయన్నారు. పోయిన ప్రాణాలు ఎలాగూ తీసుకు రాలేమని.. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పు ఎక్స్​ గ్రేషియా ఇవ్వాలని కవిత డిమాండ్​చేశారు. అలాగే, నిమ్స్​లో చికిత్స పొందుతున్న శైలజను శనివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.