- హామీలను కాంగ్రెస్ అమలు చేయట్లే: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూగట్టుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అంతటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మరొకటి లేదని తెలిపారు. తమ హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క పనినీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతున్నదని విమర్శించారు. ఎన్నికల హామీలనూ నెరవేర్చడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. జగిత్యాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కవిత ఆదివారం తన నివాసంలో సమావేశం నిర్వహించారు. తర్వాత బీసీ కుల సంఘాల ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.
ఆ తర్వాత ఆమె మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను ఎంత ప్రోత్సహించినా పార్టీ మారారని, ప్రజలు ఆయనను క్షమించరన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారి ఉంటే బాగుండేదన్నారు. పిరికివాళ్లు, పదవీ వ్యామోహం ఉన్నోళ్లు బీఆర్ఎస్ కు అవసరం లేదన్నారు. తర్వాత యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, బీసీ కుల సంఘాల ప్రతినిధులతో కూడా కవిత సమావేశమయ్యారు. కాగా.. సోమవారం ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్‌కు రిపోర్టు అందజేయాలని నిర్ణయించారు.