
- హైదరాబాద్, వెలుగు: ఆంధ్ర మ్యూజిక్
డైరెక్టర్‌తో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను కంపోజ్ చేయించడం ఎవరికీ అర్థం కాని విషయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె శాసన మండలిలో మాట్లాడుతూ.. మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్స్ లేనట్టు ఆంధ్రావారితో పాట రూపొందించడంపై సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తమవుతున్నదని తెలిపారు. మెజారిటీ ప్రజలు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మండిపడ్డారు.
జయ జయహే తెలంగాణ పాట బాధ్యతను పూర్తిగా అందెశ్రీకి అప్పగించామని, ఆయన ఎవరితో పాడించారో.. ఎవరితో కంపోజ్ చేయించారనేది తాము చూడలేదని అన్నారు. కానీ, ఆ పాట అద్భుతంగా వచ్చిందని చెప్పారు. పదేండ్ల కాలంలో తెలంగాణ తల్లిని ఎందుకు చూపించలేదని కవితను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
యాదగిరిగుట్ట యాదాద్రి ఎట్లయింది? ఆనంద్ సాయి ఎవరు? చినజీయర్‌స్వామి ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు? తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు వీరికి ఏమైనా సంబంధం ఉందా? ప్రగతి భవన్ లో సీఎం కుర్చీలో చినజీయర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేశారు. బోర్లబొక్కల పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చినజీయర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు” అని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ మండిపడ్డారు.