- మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను అమలు చేయాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌తో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. బుధవారం తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా.. ఏంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామన్న హామీని అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న మాట కూడా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కాగా, జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం ఆందోళన కలిగిస్తున్నదని కవిత పేర్కొన్నారు. రోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.