జనాభా ప్రకారమే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి : కల్వకుంట్ల కవిత ​ 

జనాభా ప్రకారమే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి : కల్వకుంట్ల కవిత ​ 
  • విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులను పెట్టాలి
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్​ 

ఖమ్మం, వెలుగు : జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌‌ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతమే రిజర్వేషన్లు కల్పిస్తామనడం సరికాదన్నారు. శనివారం ఖమ్మంలో బీసీ సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీలు 46 శాతం ఉన్నారని, రీ సర్వే చేస్తే మరో 1.5 లేదా 2 శాతం పెరుగుతారన్నారు.

మొత్తం బీసీ జనాభా సుమారు 48 శాతం ఉంటుందని, అలాంటప్పుడు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, అందుకే వేర్వేరు బిల్లులను పెట్టాలని డిమాండ్ చేశారు. ముస్లింలు, బీసీలకు కలిపి 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.

రీ సర్వేపై విస్తృతంగా ప్రచారం చేయాలని , టోల్ ఫ్రీ నంబర్‌‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఏ కారణం లేకుండానే బీఆర్ఎస్‌‌ కార్యకర్తలను అరెస్ట్‌‌ చేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.  అంతకుముందు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఖమ్మం సబ్‌‌జైలులో ఉన్న బీఆర్‌‌ఎస్‌‌ నేత లక్కినేని సురేందర్‌‌ను పరామర్సించారు. అనంతరం పాండురంగాపురంలో సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయాన్ని సందర్శించారు.