![రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి : కవిత](https://static.v6velugu.com/uploads/2025/02/brs-mlc-kavitha-demands-simultaneous-release-of-rythu-bharosa-funds_tpzRCPKdFh.jpg)
- పంటలేసి చాలా కాలమైనా పూర్తి నిధులివ్వరా?
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా నిధులను ఏకకాలంలో విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులనూ వెంటనే విడుదల చేయాలన్నారు. గురువారం పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు కవితను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
కేసీఆర్హయాంలో రైతుబంధు నిధులు టంగు టంగుమని రైతుల ఖాతాల్లో పడేవని గుర్తుచేశారు.రేవంత్ రెడ్డి సర్కార్మాత్రం దశల వారీగా నామమాత్రపు నిధులను విడుదల చేస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. రైతులు పంట వేసి చాలా కాలమైతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయి నిధులు విడుదల చేయకపోవడమేంటని ప్రశ్నించారు. సర్పంచుల పదవీ కాలం పూర్తయి ఏడాదైనా ఇంకా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఫైర్ అయ్యారు.
కోల్డ్ స్టోరేజీలో పాలమూరు
పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కారు కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని కవిత ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రాజెక్టుకు 14 నెలలుగా అనుమతులు తీసుకోకుండా గాలికొదిలేసిందన్నారు. కేసీఆర్హయాంలో సాధించిన పర్యావరణ అనుమతులపై ఉన్న న్యాయ వివాదాలను సర్కార్ తొలగించలేకపోయిందని ఆరోపించారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డికి పాలమూరు ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తున్నదన్నారు. ఎండాకాలం రాకముందే గోదారిని ఎడారి చేశారని మరో స్టేట్మెంట్లో మండిపడ్డారు.