కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే..రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉంది: కవిత

కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే..రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉంది: కవిత

కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే... రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.  ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో... కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందన్నారు .జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన కవిత.. చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది... కానీ సరిగ్గా పనిచేయదన్నారు.  మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి బురిడీ కొట్టారని విమర్శించారు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు  బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు కవిత.   మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందన్నారు. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారని.. కానీ లెక్కపెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు.  బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమన్నారు.  ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పదోవపట్టించారని చెప్పారు.

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో బిల్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు కవిత.  420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందన్నారు.  ఎండిపోయిన పొలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదన్నారు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారు.. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు కవిత.