- ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రత్యేకత ఏంది?
- తల్లి చేతిలోని జొన్నలు, మక్కలు వేరే రాష్ట్రాల్లో పండవా?: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రత్యేకత ఏముందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపమైన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి రాష్ట్ర వారసత్వాన్ని రూపుమాపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు, మక్కలు తెలంగాణకు ప్రతీక అని రేవంత్ అంటున్నారని, అవి ఇతర రాష్ట్రాల్లో పండట్లేదా? అని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని, ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టారని విమర్శించారు. బతుకమ్మను దూరం చేసి అదే తెలంగాణ తల్లి విగ్రహమంటూ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లి తమకు వద్దని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత తమ పార్టీ కార్యకర్తలతో కలిసి పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తొమ్మిది మంది కవులు, కళాకారులను సన్మానించిన ప్రభుత్వం.. ఇంటి స్థలంతో పాటు కోటి చొప్పున నజరానా ఇచ్చిందని, కానీ, అందులో మహిళలకు మాత్రం స్థానం లేదని విమర్శించారు. విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్య, మా భూమి సంధ్య, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.
- పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాల్నా?
తెలంగాణ తల్లి రూపం బీద తల్లి రూపమని సీఎం అంటున్నారని, అంటే రాష్ట్రంలో కూలినాలి చేసుకునే బీదలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలన్నది సీఎం ఉద్దేశమా? అని కవిత ప్రశ్నించారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి.. కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారు. సచివాలయంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంగీకరించబోం” అని కవిత అన్నారు.