లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాసేపటి క్రితమే కవితకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. గైనిక్ సమస్య, వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు కవిత. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీ కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు తీహార్ జైలు అధికారులు.
గతంలో జూలై 16, 2024 న కవితకు జ్వరం రావడంతో చికిత్స కోసం కవితను పశ్చిమ ఢిల్లీలోని హరినగర్ లో ఉన్న దీనదయాళ్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం కవితని తీహార్ జైలుకు తరలించారు జైలు అధికారులు
ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ఆగస్టు 27కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 27నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 23వ తేదీలోపు కవిత తరఫు న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో కేసు డెరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకని ఈడీని కోర్టు ప్రశ్నించింది.
మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని ఈ సందర్బంగా కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అర్వింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. లిక్కర్ స్కాం కేసు విచారణ పూర్తయందని, చార్జిషీట్ కూడా ఫైల్ చేసినందున బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది.